దక్షిణం నుంచి ఉత్తరానికి తిరిగి తిరిగి ఎలా కందిపోయాడో! అలసిపోయాడు సరికదా, ఇక పడుకుంటాడు ఏమోలే అనుకునేవాడిని ఒక వయసులో. కానీ అతనికి అలుపనేదే లేదని మా మామ చెప్పాడు. అటు ఇటు, ఇటు అటు తిరుగుతూనే ఉంటాడా? అలసట రాదా అనుకునేవాడిని. తర్వాత తెలిసింది... తిరిగేది భూమి అని!
భూమికి అలుపు రాదా? పడుకోదా మరి అనుకున్నా. ఆ తర్వాత తెలిసింది... తిరగకపోతే పడిపోతుందని!
"బాబోయ్! ఇంత ఉందా? అంటే నేను పడిపోకుండా ఉండాలంటే, ఈ ప్రపంచంలో కదులుతూనే ఉండాలన్నమాట" అని అప్పుడు అనిపించింది.
కాసేపటికి మెల్లగా వస్తున్న చందమామను చూశాం నేను, మామ... అప్పటిదాకా "చందమామ రావే" అని పాటలు పాడిన మామను అడిగాను... "మామా మామా... చందమామ ఈ టైమ్‌లోనే ఎందుకు వస్తాడు? పొద్దున్నే ఎందుకు రాడు?" అని.
దానికి మామ నవ్వి... "వాడు తిరుగుతూనే ఉంటాడు, కానీ సాయంత్రం అయితేనే కనిపిస్తాడు" అని ఏదేదో చెప్పాడు. నాకు అర్థం కాలేదు కానీ, ఒకటి మాత్రం అర్థమైంది... అక్కడ ఉన్నది కూడా కనపడాలి అంటే సరైన సమయం రావాలని!
ఆ చుక్కలేమో 'నేను అంటే నేను' అన్నట్టు మెరుస్తున్నాయి. సరే కదా అని ఎన్ని ఉన్నాయో లెక్కపెడదామని లెక్కేస్తున్నా. మామకి నవ్వు వచ్చింది. "ఏం మామ నవ్వుతున్నావ్?" అంటే, "నా చిన్నప్పటి నన్ను చూసుకుంటున్నానురా" అన్నాడు మామ.
"ఏం మామ, నువ్వు లెక్కపెట్టేశావా ఎన్ని ఉన్నాయో?" అన్నాను. "లేదురా అబ్బాయి... ఈ ప్రపంచంలో చాలా చుక్కలు ఉంటాయి" అన్నాడు. "అదేంటి మామ, మనకి ఇవే కదా కనిపిస్తున్నాయి?" అన్నాను. "మన కళ్ళకి కనపడనివి, మనం చూడలేనివి కూడా చాలా ఉంటాయిరా అల్లుడూ ఈ లోకంలో. అవి చూడాలంటే వేరే కన్ను కావాలి" అన్నాడు. ఓహో అనుకున్నాను నేను మళ్ళీ.
"లెక్కపెట్టలేమా?" అంటే... "అంచనాలకి మించిందిరా అబ్బాయి ఈ ఆకాశం" అన్నాడు. "ఏంటి అసలు ఆ చుక్కలు?" అని అడిగా. "అవన్నీ ఎప్పుడూ మండుతూ ఉండే రాళ్లురా... అలా ఎప్పుడూ వెలగాలంటే మనం లోపల నుంచి ఎంత మండాలి?" అన్నాడు. అడిగితే చాలా చెప్పాడు.
మొత్తానికి వెలగాలంటే ముందు మనం కాలాలి, మండాలి. ఆ మాట అర్థమైంది.
వెన్నెల చూస్తూ ప్రశాంతంగా పడుకుంటున్నాడు మామ. తెలియక లేపేశా... నాకేమో నిద్ర రాట్లేదాయే! "ఏరా మళ్ళీ ఏమైంది?" అంటాడు మామ. "ఏం లేదు మామ, ఏంటి ఇది? ఇప్పటిదాకా బాలేదు కదా, ఎందుకు ఇంత బాగుంది ఇప్పుడు?" అన్నాను నేను. అబ్బో! మళ్ళీ నవ్వాడు...
"వెన్నెల అంటారురా దీన్ని. స్వయం ప్రకాశం లేకపోయినా, మనకోసం వెలిగే చంద్రుడు మనతో పాటు అందరికీ ఆనందాన్ని ఇస్తున్నాడు. అందుకే కదా మనం ఇంత దగ్గర వాడిలా మామ మామ అంటున్నాం" అన్నాడు.
అప్పుడు అనిపించింది... మన దగ్గర సత్తువ లేకపోయినా, నలుగురి కోసం వెలిగితే 'అందరివాడు' అంటారని! అందరూ మనల్ని తమ వాడు అంటారని!